తొందరపాటు మనిషి పాలిట మృత్యువు కాటు
الْحَمْدُ لِلَّهِ الَّذِي خَلَقَ الزَّمَانَ، وَقَدَّرَ الْأَعْمَارَ وَالْآجَالَ، وَأَمَرَ بِالتَّأَنِّي، وَذَمَّ الْعَجَلَةَ وَنَهَى عَنِ الِاسْتِعْجَالِ، وَأَشْهَدُ أَن لَّا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، ذُو الْعَظَمَةِ وَالْجَلَالِ، وَأَشْهَدُ أَنَّ نَبِيَّنَا مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، كَرِيمُ الشَّمَائِلِ وَالْخِصَالِ، صَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَيْهِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ خَيْرِ صَحْبٍ وَآلٍ، وَعَلَى تَابِعِيهِمْ بِإِحْسَانٍ مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ وَالْجِبَالُ.
﴿خُلِقَ الْإِنْسَانُ مِنْ عَجَلٍ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونِ﴾
“మానవుడు తొందరపాటు స్వభావంతో సృష్టించబడ్డాడు. నేను నా సూచనలను మీకు చూపిస్తాను. కాబట్టి మీరు తొందరపడకండి.” (సూరతుల్ అంబియా: 37)
మనుషులు పుట్టినప్పటి నుండి నేర్చుకునే మొదటి పాఠాలలో ఓర్పు ఒకటి. అయితే, ఆధునిక వేగవంతమైన (fast-paced) యుగంలో ప్రతి ఒక్కరూ క్షణాల మీద ఫలితాలు కోరుకుంటున్నారు. ఏదైనా పని వెంటనే జరిగిపోవాలి, ఏ పనైనా క్షణాల్లో ముగిసిపోవాలి, ఫలితాలు ఇన్స్టంట్గా రావాలి-ఇదే నేటి మన అందరి ఆరాటం. కానీ సత్యమార్గం లో నడవాలనుకునే వారికి తొందరపాటు ఉండకూడదు. ఓర్పు అనేది బలహీనత కాదు, అది ఒక అపారమైన మానసిక శక్తి. ఏ పనైనా ఆత్రుతతో చేస్తే అందులో పారదర్శకత లోపిస్తుందని, ఏ విషయంలోనయినా నిదానమే ప్రధానం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ పశ్చాత్తాపాన్నే మిగుల్చుతా యి, విచక్షణతో కూడిన ఆలోచనే విజయానికి పునాది. అన్నిటికంటే వేగంగా పరుగెత్తాలని చూడకండి; పరుగులో వేగం ముఖ్యం కాదు, వెళ్లే దిశ సరైనదో కాదో ముఖ్యం. ఏ పనినైనా అత్యంత వేగంగా చేయాలని చూస్తే అది ఎక్కువ కాలం నిలవదు.
. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَكَانَ الْإِنْسَانُ عَجُولًا
మానవుడు ఎంతో తొందరపాటు స్వభావం కలవాడు. (సూరతుల్ ఇస్రా: 11)
మానవుని తొందరపాటు స్వభావాలలో ఒకటి ఏమిటంటే, తక్కువ విలువ కలిగినప్పటికీ తక్షణమే లభించే వాటికి ప్రాధాన్యత ఇస్తాడు. అయితే ఆలస్యంగా లభించినప్పటికీ ఎంతో గొప్ప విలువ కలిగిన వాటిని నిర్లక్ష్యం చేస్తాడు.
పెద్దలు ఇలా అన్నారు:
الْأَنَاةُ حِصْنُ السَّلَامَةِ، وَالْعَجَلَةُ مِفْتَاحُ النَّدَامَةِ
నిదానంగా ఆలోచించి వ్యవహరించడం క్షేమానికి కోట వంటిది. తొందరపాటు పశ్చాత్తాపానికి తాళంచెవి వంటిది.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
خُلِقَ الْإِنْسَانُ مِنْ عَجَلٍ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونِ
మానవుడు తొందరపాటు స్వభావంతో సృష్టించబడ్డాడు. త్వరలోనే నేను మీకు నా సూచనలను చూపిస్తాను. కాబట్టి మీరు తొందరపడకండి. సూరతుల్ అంబియా: 37
ప్రముఖ వ్యాఖ్యాత ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ తన తఫ్సీర్లో ఈ ఆయత్ వివరణలో ఇలా పేర్కొన్నారు:
أَيْ: طَبْعُ الْإِنْسَانِ الْعَجَلَةُ، فَيَسْتَعْجِلُ كَثِيرًا مِنَ الْأَشْيَاءِ؛ وَإِنْ كَانَتْ مُضِرَّةً
అంటే, తొందరపాటు అనేది మానవుని సహజ స్వభావం. అందుకే అతడు అనేక విషయాలలో తొందరపడతాడు. అవి తనకు హాని కలిగించేవి అయినప్పటికీ వాటిని త్వరగా పొందాలని ఆరాటపడతాడు.
నిజానికి తొందరపాటు అనేది అపజయాలకు మూలం, పశ్చాత్తాపాలకు తల్లివేరు వంటిది. ఇది మానవుని వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపించే చెడు లక్షణం. దీని కారణంగా అతడు చెడు పరిణామాలను, సంతోషాన్ని కలిగించని ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే అల్లాహ్ తన అపారమైన కరుణతో అతడిని ఆదుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ ﷺ గారికి కూడా తొందరపడకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆదేశించాడు.
وَلَا تَعْجَلْ بِالْقُرْآنِ مِنْ قَبْلِ أَنْ يُقْضَى إِلَيْكَ وَحْيُهُ وَقُلْ رَبِّ زِدْنِي عِلْمًا
ప్రవక్తా! నీదగ్గరకు ఖుర్ఆన్ పూర్తిగా రానంతవరకు నీవు దాన్ని పఠించడానికి తొందరపడకు.“ప్రభూ! నాకు మరింతజ్ఞానం ప్రసాదించు” అని వేడుకో! (సూరతు తాహా: 114) మరొకచోట అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
فَاصْبِرْ كَمَا صَبَرَ أُولُو الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِلْ لَهُمْ
దృఢ సంకల్పం కలిగిన ప్రవక్తలు సహనం వహించినట్లే నీవు కూడా సహనం వహించు. వారి విషయంలో తొందరపడకు. (సూరతుల్ అహ్ఖాఫ్: 35)
ప్రవక్త ముహమ్మద్ ﷺ గారు అషజ్జ్ అబ్దుల్ ఖైస్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు:
إِنَّ فِيكَ خَصْلَتَيْنِ يُحِبُّهُمَا اللَّهُ: الْحِلْمُ وَالْأَنَاةُ
నిశ్చయంగా నీలో అల్లాహ్ ఇష్టపడే రెండు సుగుణాలు ఉన్నాయి. అవి సహనం, సంయమనం (తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం). (సహీహ్ ముస్లిం)
ఇక్కడ ప్రస్తావించబడిన అనాత్ అంటే ఒక విషయం గురించి తొందరపడకుండా, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో స్పష్టమయ్యే వరకు నిదానంగా ఆలోచించి వ్యవహరించడం. ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడైనా, తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతే తప్పులు చేస్తాడు. ఎంత అనుభవం ఉన్నవాడైనా, ఆలోచించకుండా నిర్ణయాలు తీసు కుంటే నష్టపోతాడు. అందుకే సహనం, సంయమనం విశ్వాసిలో ఉండవలసిన గొప్ప లక్షణాలు.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు: నష్టం జరిగిపోయిన తర్వాత ఎంత బాధపడినా లేదా జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. నిదానమే ప్రధానం: ఏ పనినైనా కంగారు పడకుండా నెమ్మదిగా, జాగ్రత్తగా చేస్తేనే మంచి ఫలితం వస్తుంది.
మనిషి జీవితంలో సమయం ఎంతో విలువైనది. ప్రతి పనిని సరైన సమయంలో పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ పనిని సరైన పద్ధతిలో చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే కొంతమంది ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలనే ఆత్రుతతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. మాట్లాడే ముందు ఆలోచించరు, చేసే ముందు పరిణామాలను అంచనా వేయరు, నిర్ణయం తీసుకునే ముందు సాధ్యాసాధ్యాలను పరిశీలించరు. ఫలితంగా చిన్న చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారుతాయి. తొందరపాటు అనేది వేగం కాదు; ఆలోచనకు తగిన సమయం ఇవ్వకపోవడం. వేగంగా పనిచేయడం ఒక మంచి లక్షణమే. కానీ వివేకం లేకుండా వేగంగా పనిచేయడం ప్రమాదకరం. వేగం మనల్ని గమ్యానికి చేర్చవచ్చు, కానీ వివేకం మనల్ని సరైన గమ్యానికి చేరుస్తుంది.
మన నిత్యజీవితంలో తొందరపాటుకు సంబంధించిన అనేక రూపాలు, రకరకాల ఉదాహరణలు కనిపిస్తుంటాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటంటే, తక్షణమే లభించే ప్రాపంచిక సుఖాలను ఇష్టపడుతూ పరలోక జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం. అంటే, ఈ తాత్కాలిక ప్రపంచాన్ని అమితంగా ప్రేమించడం, ఇందులోని నశించిపోయే కోరికలను వెంటనే తీర్చుకోవాలని ఆరాటపడటం, అదే సమయంలో శాశ్వతమైన మేలులతో నిండిన పరలోక జీవితం పట్ల నిర్లక్ష్యం వహించడం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ وَتَذَرُونَ الْآخِرَةَ
ఎంతమాత్రం కాదు! వాస్తవానికి మీరు ఈ తక్షణ ప్రాపంచిక జీవితాన్ని ప్రేమిస్తున్నారు. పరలోక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. (సూరతుల్ ఖియామహ్: 20-21) మరొకచోట అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّ هَؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا
నిశ్చయంగా వీరు ఈ తాత్కాలిక ప్రపంచ జీవితాన్ని ప్రేమిస్తున్నారు. తమ వెనుక ఉన్న అత్యంత భారమైన దినాన్ని, (అంటే ప్రళయదినాన్ని) నిర్లక్ష్యం చేస్తున్నారు. (సూరతుల్ ఇన్సాన్: 27)
ఈ వ్యాధి మానవుడిని పరలోకం కంటే ప్రాపంచిక జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేలా చేసింది. అలాగే సత్కార్యాలు, విధేయతల కంటే పాపకార్యాలకు, అవిధేయతలకు ప్రాధాన్యతనిచ్చేలా చేసింది!
జీవితం చుట్టూ పేరుకున్న ఆశలు, ఆశయాలు, తాపత్రయాలు, సాధించిన విజయాలు అన్నింటినీ పటాపంచలు చేయగలిగిన శక్తి ఒక్క మృత్యువుకే ఉంటుంది. ‘‘ప్రతి మనిషికీ బతికి ఉండడానికి ఒక కారణం అంటూ ఉండాలి. అలాంటి మనిషి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా బతికే ఉంటాడు. జీవితేచ్ఛ అతన్ని బతికిస్తుంది. బతకడానికి ఒక కారణం అంటూ లేనివాళ్ళు త్వరగా మరణిస్తారు’’ బతకడానికి, బతికి ఉండడానికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. జీవితం మనల్ని మృత్యువు ముంగిట్లో నిలబెట్టినప్పుడు అలాంటి కారణం ఇంకా అవసరమవుతుంది.
మాట్లాడటంలో తొందరపాటు
ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకముందే సమాధానం చెప్పడం, కోపంలో కఠినమైన మాటలు మాట్లాడటం, ఇతరుల మాటలకు అపార్థాలు చేసుకోవడం సంబంధాలను దెబ్బతీస్తాయి. మన నాలుక నుంచి వెలువడిన మాట తిరిగి మన దగ్గరకు రాదు. అందువల్ల మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం ఎంతో అవసరం.
నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు:
వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు వంటి ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి నిర్ణయానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. వాటిని ముందుగానే అంచనా వేయాలి.
ఇతరుల గురించి అభిప్రాయాలు ఏర్పరచుకోవడంలో తొందరపాటు:
ఒక వ్యక్తి గురించి ఒక్కరి మాట విని నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదు. ఒక సంఘటనలోని పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరినీ నిందించకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنْ جَاءَكُمْ فَاسِقٌ بِنَبَإٍ فَتَبَيَّنُوا﴾
“ఓ విశ్వాసులారా! ఒక దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా వార్త తీసుకువస్తే, మీరు దాని వాస్తవాన్ని పరిశీలించండి.” (సూరతుల్ హుజురాత్: 6) ఈ ఆయత్ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఏ వార్తనైనా విన్న వెంటనే నమ్మకూడదు. పరిశీలించకుండా ప్రచారం చేయకూడదు. వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు.
ఆవేశంలో స్పందించడంలో తొందరపాటు:
కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం వల్ల మనం చెప్పకూడని మాటలు చెబుతాము. చేయకూడని పనులు చేస్తాము. అందుకే కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం, కొంత సమయం తీసుకోవడం, పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
كَفَى بِالْمَرْءِ كَذِبًا أَنْ يُحَدِّثَ بِكُلِّ مَا سَمِعَ
ఒక వ్యక్తి తాను విన్న ప్రతి విషయాన్ని ఇతరులకు చెప్పడమే అతడు అబద్ధాలకోరుగా మారడానికి సరి పోతుంది.(సహీహ్ ముస్లిం,)
దుఆ స్వీకరించబడటంలో తొందరపడటం.
ఒక వ్యక్తి ఒకసారి లేదా రెండుసార్లు లేదా మూడుసార్లు దుఆ చేస్తాడు. ఆ తరువాత తన దుఆకు సమాధానం రావడం ఆలస్యమవుతోందని భావిస్తాడు. దాంతో దుఆ చేయడం పట్ల విసుగు చెంది, దానిని వదిలివేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ యొక్క దైవిక వివేకాన్ని, ఆయన నిర్ణయంలోని అంతరార్థాన్ని మరచిపోతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
يُسْتَجَابُ لِأَحَدِكُمْ مَا لَمْ يَعْجَلْ، يَقُولُ: دَعَوْتُ فَلَمْ يُسْتَجَبْ لِي
మీలో ఎవరైనా తొందరపడనంత వరకు అతని దుఆ స్వీకరించబడుతూనే ఉంటుంది. అయితే అతడు తొందరపడి, నేను దుఆ చేశాను, కానీ నా దుఆ స్వీకరించబడలేదు అని అనకూడదు. (బుఖారీ, ముస్లిం)
శపించడంలో తొందరపాటు
కోపం వచ్చిన సమయంలో తొందరపడి చేసే దుఆల కారణంగా ఎన్ని విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయో! అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَيَدْعُ الْإِنْسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ وَكَانَ الْإِنْسَانُ عَجُولًا
మానవుడు తనకు మేలు కలగాలని కోరుకునే విధంగా కీడును కూడా కోరుకుంటాడు. వాస్తవానికి మానవుడు ఎంతో తొందరపాటు స్వభావం కలవాడు. (సూరతుల్ ఇస్రా: 11)
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక అన్సారీ సహాబీ ఒంటె నడవకుండా మొండికేసింది. దాంతో అతడు ఆ ఒంటెను శపించాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించారు:
مَنْ هَذَا اللَّاعِنُ بَعِيرَهُ؟
తన ఒంటెను శపిస్తున్నది ఎవరు?
ఆ వ్యక్తి, ఓ అల్లాహ్ ప్రవక్తా! నేనే అని సమాధానమిచ్చాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
انْزِلْ عَنْهُ، فَلَا تَصْحَبْنَا بِمَلْعُونٍ، لَا تَدْعُوا عَلَى أَنْفُسِكُمْ، وَلَا تَدْعُوا عَلَى أَوْلَادِكُمْ، وَلَا تَدْعُوا عَلَى أَمْوَالِكُمْ؛ لَا تُوَافِقُوا مِنَ اللَّهِ سَاعَةً يُسْأَلُ فِيهَا عَطَاءً فَيَسْتَجِيبَ لَكُمْ
దాని మీద నుంచి దిగిపో! శపించబడిన దానిని వెంటబెట్టుకొని మాతో ప్రయాణించకు. మీకు మీరు వ్యతిరేకంగా బద్ దుఆ చేయకండి. మీ పిల్లలకు వ్యతిరేకంగా బద్ దుఆ చేయకండి. మీ ఆస్తులకు వ్యతిరేకంగా కూడా బద్ దుఆ చేయకండి. ఎందుకంటే అల్లాహ్ వద్ద ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆయనను ఏదైనా కోరుకుంటే, ఆయన మీ కోరికను స్వీకరించవచ్చు. కాబట్టి ఆ సమయానికి మీ బద్ దుఆ చేయకుండా జాగ్రత్తపడండి. (సహీహ్ ముస్లిం)
ఫత్వా ఇవ్వడంలో తొందరపాటు
సరైన ఆధారాలు లేకుండా లేదా అర్హత లేకుండా తొందరపడి ధార్మిక తీర్పులు (ఫత్వాలు) ఇవ్వడం.
وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَذَا حَلَالٌ وَهَذَا حَرَامٌ لِتَفْتَرُوا عَلَى اللَّهِ الْكَذِبَ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
మీరు ఇట్టే నోటికొచ్చినట్లు “ఇది ధర్మసమ్మతమైనది, అది అధర్మమైనది” అని అబద్ధాలాతున్నారు. ఇలాంటి ఆజ్ఞలు జారీచేస్తూ అల్లాహ్ మీద అసత్యాన్ని మోపకండి. అల్లాహ్ మీద అసత్యారోపణలు చేసేవారు ఎన్నటికీ సాఫల్యం చెందలేరు. (సూరతున్నహ్ల్: 116)
విడాకుల విషయంలో తొందరపడటం.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు, వాదోపవాదాలు తీవ్రరూపం దాల్చినప్పుడు ఆవేశంతో వెంటనే విడాకుల నిర్ణయం తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలాంటి తొందరపాటు కారణంగా ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయో, ఎన్ని గృహాలు కూలిపోయాయో ఆలోచించండి! ఒక కవి ఇలా అన్నాడు:
قَدْ يُدْرِكُ الْمُتَأَنِّي بَعْضَ حَاجَتِهِ – وَقَدْ يَكُونُ مَعَ الْمُسْتَعْجِلِ الزَّلَلُ
నిదానంగా ఆలోచించి వ్యవహరించేవాడు తన అవసరాలలో కొన్నింటినైనా సాధించగలుగుతాడు. కానీ తొందరపడేవాడు తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది.
పనులను త్వరగా పూర్తి చేయాలనే ఆత్రుత, వాటిని సమగ్రంగా మరియు నాణ్యతతో పూర్తి చేయకుండా అడ్డుకుంటుంది. తొందరపాటు వృథాకు దారితీస్తుంది. తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఒక పని చేస్తే, అందులో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తప్పులను సరిదిద్దడానికి మళ్లీ సమయం, శ్రమ, ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి మొదట్లోనే ఆలోచించి, జాగ్రత్తగా పని చేయడం ఉత్తమం. వివేకంతో, నిదానంగా ముందుకు సాగాలి. అతిగా వేగంగా పరుగెత్తేవారు తడబడతారు. జీవిత ప్రయాణంలో కూడా ఇదే సత్యం. ఇతరుల కంటే ముందు చేరుకోవాలనే ఆత్రుతలో తప్పు దారిలో ప్రయాణించకూడదు. నిదానంగా అయినా సరైన మార్గంలో నడిచేవారే చివరకు విజయాన్ని అందుకుంటారు. తొందరపడని వ్యక్తికి విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. తొందరపాటు మాత్రం భవిష్యత్తు పరిణామాలను సరిగ్గా అంచనా వేయలేని అంధత్వం వంటిది.
తొందరపాటు వల్ల కలిగే నష్టాలు
తొందరపాటు మనిషి ఆలోచనా శక్తిని బలహీనపరుస్తుంది. ఒక విషయం పూర్తిగా తెలుసుకోకుండానే అభిప్రాయం ఏర్పరచుకోవడం, ఎదుటివారి మాట పూర్తిగా వినకుండానే స్పందించడం, వాస్తవాలను పరిశీలించకుండానే ఇతరులపై ఆరోపణలు చేయడం వంటి పనులు తొందరపాటు వల్లే జరుగుతాయి. ఒక చిన్న మాట కుటుంబంలో కలహాలకు దారితీయవచ్చు. ఒక ఆవేశపూరిత నిర్ణయం స్నేహాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. ఒక నిర్లక్ష్యపు అడుగు వ్యాపారంలో నష్టాన్ని కలిగించవచ్చు. ఒకసారి పంపిన సందేశాన్ని వెనక్కి తీసుకోలేము. ఒకసారి పలికిన కఠినమైన మాట ఎదుటివారి హృదయంలో కలిగించిన గాయాన్ని వెంటనే మాన్పలేము. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి, ఏదైనా చేసే ముందు దాని పరిణామాలను అంచనా వేయాలి, ఏదైనా నిర్ణయించే ముందు అన్ని కోణాలను పరిశీలించాలి.
తొందరపాటును ఎలా నియంత్రించుకోవాలి?
తొందరపాటు మనిషి సహజ స్వభావంలో భాగమైనప్పటికీ, దానిని నియంత్రించుకోవడం సాధ్యమే. అందుకు కొన్ని మంచి అలవాట్లు అవసరం.
1. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి.
2. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలను పరిశీలించాలి.
3. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం మౌనంగా ఉండాలి.
4. ఇతరుల గురించి విన్న విషయాలను వెంటనే నమ్మకుండా నిజానిజాలను తెలుసుకోవాలి.
5. ముఖ్యమైన పనుల్లో అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలి.
6. ఒక పని ప్రారంభించినప్పుడు ఫలితం కోసం ఆత్రుత పడకుండా నిరంతరం కృషి చేయాలి.
7. అల్లాహ్పై నమ్మకం ఉంచి, ఆయన నిర్ణయం పట్ల సంతృప్తి కలిగి ఉండాలి.
తొందరపాటు అనేది నిందనీయమైన లక్షణాలలో ఒకటి. ఎందుకంటే దాని పర్యవసానాలు చాలా ప్రమాదకర మైనవి, దాని ఫలితాలు ఎంతో బాధాకరమైనవి. ఇబ్ను హిబ్బాన్ అల్ బుస్తీ రహిమహుల్లాహ్ తొందరపాటు స్వభావం కలిగిన వ్యక్తిని గురించి వివరిస్తూ ఇలా అన్నారు:
الْعَجِلُ يَقُولُ قَبْلَ أَنْ يَعْلَمَ، وَيُجِيبُ قَبْلَ أَنْ يَفْهَمَ، وَيَحْمَدُ قَبْلَ أَنْ يُجَرِّبَ، وَيَذُمُّ بَعْدَمَا يَحْمَدُ، يَعْزِمُ قَبْلَ أَنْ يُفَكِّرَ، وَيَمْضِي قَبْلَ أَنْ يَعْزِمَ، وَالْعَجِلُ تَصْحَبُهُ النَّدَامَةُ، وَتَعْتَزِلُهُ السَّلَامَةُ، وَكَانَتِ الْعَرَبُ تُكَنِّي الْعَجَلَةَ أُمَّ النَّدَامَاتِ
తొందరపాటు స్వభావం కలిగిన వ్యక్తి ఒక విషయం గురించి తెలుసుకోకముందే మాట్లాడతాడు. పూర్తిగా అర్థం చేసుకోకముందే సమాధానం చెబుతాడు. అనుభవించి చూడకముందే ప్రశంసిస్తాడు. ప్రశంసించిన తరువాత అదే విషయాన్ని నిందిస్తాడు. ఆలోచించకముందే ఒక నిర్ణయం తీసుకుంటాడు. దృఢంగా నిర్ణయించుకోకముందే పనిలోకి దిగిపోతాడు.
తొందరపాటు వ్యక్తిని ఎల్లప్పుడూ పశ్చాత్తాపం వెంటాడుతుంది. క్షేమం, భద్రత అతనికి దూరమవుతాయి. అందుకే అరబ్బులు తొందరపాటును పశ్చాత్తాపాల తల్లి అని పిలిచేవారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం ధర్మం తొందరపడాలని, వెంటనే ఆచరించాలని ఆదేశించింది. ఎందుకంటే వాటిలో తక్షణమే లేదా భవిష్యత్తులో ఎంతో మేలు ఉంది.
అలాంటి వాటిలో ముఖ్యమైనవి:
· సత్కార్యాలను వెంటనే ఆచరించడం.
· చేసిన పాపాల నుండి వెంటనే పశ్చాత్తాపపడి అల్లాహ్ వైపు మరలడం.
· అప్పులు మరియు ఇతరుల హక్కుల విషయంలో మన బాధ్యతలను త్వరగా నెరవేర్చడం.
· మరణించినవారిని త్వరగా ఖననం చేయడం.
· స్పష్టమైన ప్రయోజనం ఉన్న పనులను ఆలస్యం చేయకుండా చేయడం. ఉదాహరణకు యువకులు, యువతులకు వివాహం చేయడం మరియు ఇలాంటి ఇతర శుభకార్యాలు.అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَسَارِعُوا إِلَى مَغْفِرَةٍ مِنْ رَبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ
మీ ప్రభువు నుండి లభించే క్షమాభిక్ష వైపునకు, ఆకాశాలు మరియు భూమి అంత విశాలమైన స్వర్గం వైపునకు మీరు త్వరపడండి. అది భయభక్తులు కలవారి కోసం సిద్ధపరచబడింది. (సూరతు ఆలి ఇమ్రాన్: 133)
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా సెలవిచ్చారు:
بَادِرُوا بِالْأَعْمَالِ
సత్కార్యాలను చేయడంలో తొందరపడండి. వాటిని ఆలస్యం చేయకండి. (సహీహ్ ముస్లిం)
أَسْرِعُوا بِالْجَنَازَةِ، فَإِنْ تَكُ صَالِحَةً فَخَيْرٌ تُقَدِّمُونَهَا، وَإِنْ يَكُ سِوَى ذَلِكَ، فَشَرٌّ تَضَعُونَهُ عَنْ رِقَابِكُمْ
జనాజాను త్వరగా తీసుకెళ్లండి. మరణించిన వ్యక్తి సత్పురుషుడైతే, మీరు అతడిని ఒక మంచి గమ్యస్థానానికి త్వరగా చేర్చినవారవుతారు. ఒకవేళ అతడు అలా కాకపోతే, ఒక చెడును మీ భుజాలపై నుండి దించుకున్న వారవుతారు.
ధర్మం తొందరగా ఆచరించాలని ప్రోత్సహించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అవకాశాలు చేజారి పోకముందే వాటిని సద్వినియోగం చేసుకోవడం. అలాగే ఇతరుల హక్కులు మనపై భారంగా మారకముందే వాటిని నెరవేర్చడం, సత్కార్యాల వైపు పరుగెత్తడం, ఇతరులకు ఉదారంగా సహాయం చేయడం, దానధర్మాలు చేయడం వంటివి కూడా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే అవి చేయడానికి ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడవచ్చు. నిజానికి మానవుని ఆయుష్షు చాలా స్వల్పమైనది. అవకాశాలు మేఘాలు వేగంగా కదిలిపోయినట్లు త్వరగా గడిచిపోతాయి.
కాబట్టి ఒక విశ్వాసికి ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయడం తగదు. అలాగే ఏదైనా విధేయతా కార్యాన్ని లేదా మంచి పనిని రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉండటం కూడా తగదు. ఎందుకంటే రేపు తనకు ఎలాంటి ప్రాపంచిక పరిస్థితులు ఎదురవుతాయో, అల్లాహ్ తనకు ఎంత ఆయుష్షును నిర్ణయించాడో అతనికి తెలియదు. ఒక కవి ఇలా అన్నాడు:
وَرُبَّمَا فَاتَ قَوْمًا بَعْضُ أَمْرِهِمُ – مَعَ التَّأَنِّي وَكَانَ الْحَزْمُ لَوْ عَجِلُوا
కొన్నిసార్లు నిదానంగా వ్యవహరించడం వల్ల కొందరు తమకు సంబంధించిన కొన్ని పనులలో అవకాశాలను కోల్పోతారు. ఆ సమయంలో వారు తొందరగా వ్యవహరించి ఉంటే అదే వివేకంతో కూడిన నిర్ణయం అయ్యేది.
చివరి మాట
ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు, కానీ ప్రతి పనీ సమయానికి పూర్తవుతుంది. ప్రకృతిని గమనించండి… విత్తనం వేయగానే మరుసటి రోజు మహావృక్షం అయిపోదు. దానికి కాలం కావాలి, ఎండ కావాలి, నీరు కావాలి. ఒక పువ్వు వికసించాలన్నా సమయం పడుతుంది. మరి మనుషులమైన మనం మాత్రం ప్రతి విషయంలోనూ ఎందుకు అంత తొందరపడాలి? జీవితంలోనూ, కెరీర్లోనూ, సంబంధాలలోనూ తొందరపాటును విడనాడి, ప్రశాంతతను మరియు ఓర్పును అలవర్చుకుంటేనే శాశ్వతమైన విజయం, ఆనందం సాధ్యమవుతాయి. ఒక అడుగు ముందుకేసే ముందు, ఒక క్షణం ఆగి ఆలోచిద్దాం. తొందరపాటుతో సాధించే తాత్కాలిక విజయం కంటే, ఓర్పుతో సంపాదించు కునే శాశ్వత ప్రశాంతతే నిజమైన విజయం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనలలో “నిదానంగా, ఆలోచించి పనిచేయడం దేవుని (అల్లాహ్) నుండి వస్తుంది, అయితే తొందరపాటు షైతాను నుండి వస్తుంది” అని స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయాలని ఇస్లాం బోధిస్తుంది. “సహనం సర్వత్ర సాధనం” (ఓర్పు అన్నిటినీ సాధిస్తుంది) అనేది విజయ సూత్రం.
తొందరపాటు మనిషి పాలిట మృత్యువు కాటు
తెలుగులో ఇస్లాం • నవంబర్ 24, 2026 5 వీక్షణలుసమీక్షించినవారు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమర్